25

1 "పరలోకం నుండి దేవుని పరిపాలనను ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి ఒక పెళ్ళివిందుకు వెళ్ళారు. వాళ్ళు దీపాలు పట్టుకుని పెళ్ళికొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. 2 ఇందులో ఐదుగురు తెలివి గలవాళ్ళు, ఐదుగురు తెలివి తక్కువ వాళ్ళు. 3 అయితే, తెలివి తక్కువ కన్యలు దీపాలు పట్టుకున్నారు గానీ వాటిలో నూనె అయిపోతే అదనంగా కావలసిన ఒలీవ నూనె తీసుకెళ్ల లేదు. 4 అయితే తెలివి గల కన్యలు మాత్రం దీపాలలో కావలసిన నూనెతో బాటు, సీసాల్లో కూడా అదనంగా నూనె వేసి తెచ్చుకున్నారు."

5 "పెళ్ళి కొడుకు రావడానికి చాల సమయం తీసుకున్నాడు. రాత్రి చాలా ఆలస్యమైపోయింది. అయితే కన్యలందరూ అలసిపోయి మత్తుగా నిద్ర పోయారు. 6 అర్ధ రాత్రి వేళ, "ఇదిగో, పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆయన్ని కలుసుకోండి!" అని కొందరు అరుస్తూ వాళ్ళని నిద్ర లేపారు."

7 "అమ్మాయిలు అందరూ లేచి తమ దీపాలను సరి చేసుకొని వెలిగించుకున్నారు. 8 అప్పుడు తెలివి తక్కువ కన్యలు తెలివైన వారితో, "మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి, మీ నూనె కొంచెం మాకిస్తారా?" అని అడిగారు. 9 దానికి వాళ్ళు, "మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి" అని చెప్పారు. 10 అయితే, ఈ తెలివి తక్కువ కన్యలు నూనె కొనుక్కోడానికి వెళ్తుండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు కన్యలు పెళ్ళికొడుకుతో కలిసి పెళ్ళికూతురు కనిపెడుతూ ఉన్న పెళ్ళి హాల్లోకి వెళ్ళారు. వెంటనే తలుపు మూసేశారు."

11 "ఆ తరవాత మిగిలిన కన్యలు పెళ్ళి వేడుక దగ్గరికి వచ్చి "ప్రభూ, తలుపు తెరవండి" అని పెళ్ళి కొడుకుని అడిగారు. 12 కానీ, పెళ్ళి కొడుకు వారితో, "మీరెవరో నిజంగా నాకు తెలీదు. కాబట్టి నేను మీకోసం తలుపు తీయను" అన్నాడు."

13 యేసు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు, "ఈ విధంగా మీకు జరక్కూడదు కాబట్టీ, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆ గంటైనా, రోజైనా మీకు తెలీదు కాబట్టీ, మెలకువగా ఉండండి."

14 "మనుష్యకుమారుడు రాజుగా ఏలడానికి పరలోకం నుండి తిరిగిరావడం దూర ప్రయాణం వెళ్ళబోతున్న ఒక మనిషి పోలికగా ఉంది. అతడు ప్రయాణానికి వెళ్ళే ముందు తన సేవకులందరినీ పిలిచి, వాళ్ళకి తన ఆస్తిలో కొంత సొమ్ము ఇచ్చి, తాను తిరిగి వచ్చేంతవరకు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి తనకోసం మరింత సంపాదించమని చెప్పాడు. 15 అతడు ఆ ఆస్తిని ఉపయోగించడంలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి పంచి ఇచ్చాడు. ఉదాహరణకు, ఒక సేవకునికి 165 కిలోల బరువైన 5 సంచుల బంగారం ఇస్తే, ఇంకొక సేవకునికి 66 కిలోల బరువైన రెండు సంచుల బంగారాన్నీ, ఇంకొకడికి 33 కిలోల బరువైన ఒక సంచి బంగారాన్నీ ఇచ్చాడు. తరవాత అతడు ప్రయాణమై వెళ్ళిపోయాడు. 16 ఐదు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వెంటనే వెళ్ళి, దానితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు సంచుల బంగారాన్ని సంపాదించాడు."

17 అలాగే, రెండు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వ్యాపారం చేసి, ఇంకో రెండు సంచుల బంగారాన్ని సంపాదించాడు. 18 అయితే ఒక్క సంచి బంగారం తీసుకున్న సేవకుడు వెళ్ళి, నేలలో గుంట తవ్వి, జాగ్రత్తగా ఉంటుందని అక్కడ దాచిపెట్టాడు."

19 "చాలా కాలం తరవాత ఆ యజమాని తిరిగి వచ్చాడు. తన సేవకులందరినీ పిలిచి, తానిచ్చిన డబ్బుతో ఎలా వ్యాపారం చేశారు అని లెక్కలడిగాడు. 20 ఐదు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు 10 సంచులు తెచ్చాడు. అతడు, "అయ్యగారూ, మీరు నాకు ఐదు సంచుల బంగారం ఇచ్చారు. చూడండి, వాటితో వ్యాపారం చేసి, ఇంకా అదనంగా ఐదు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు. 21 దానికి ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులమీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."

22 "రెండు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు కూడా వచ్చి, యజమానితో, "అయ్యగారూ, మీరిచ్చిన రెండు సంచుల బంగారాన్ని జాగ్రత్తగా వాడాను. చూడండి, వాటితో వ్యాపారం చేసి అదనంగా రెండు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు. 23 అందుకు ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులకు నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."

24 "ఒక సంచి బంగారం తీసుకున్న సేవకుడు వచ్చి యజమానితో, "అయ్యగారూ, మీరు నన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను. మీరు మీది కానిదీ, పెట్టుబడి ఏమీ పెట్టని పెద్ద మొత్తాలనూ, ఇతరులనుండి లాక్కునేంత కఠినాత్ములనీ, వేరేవారు నాటిన పంటను కోసుకొనే వాళ్ళనీ నాకు తెలుసు. 25 ఈ డబ్బు పోతే మీరేం చేస్తారో అని భయపడి దీనిని భూమిలో పాతిపెట్టాను. ఇదిగో, దయచేసి తీసేసుకోండి" అన్నాడు. 26 అప్పుడు ఆ యజమాని, "నువ్వు సోమరిపోతువి, పనికిమాలిన చెడ్డ సేవకుడివి. నేను పెట్టుబడి కూడా పెట్టకుండా ఎక్కువ మొత్తాన్ని లాక్కునేంత కఠినాత్ముడననీ, ఎవడో నాటిన పంటను కోసుకొనేవాడిననీ నీకు తెలుసు కదా. 27 అలాంటప్పుడు కనీసం నా డబ్బులు బ్యాంక్ లో వేసి ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు వాటిని వడ్డీతో సహా తీసుకొనేవాడిని కదా." 28 అప్పుడు ఆ యజమాని తన సేవకులతో, "అతని దగ్గర ఉన్న సంచెడు బంగారాన్ని తీసేసి పది సంచీలు బంగారం సంపాదించిన సేవకునికి ఇచ్చెయ్యండి. 29 దేవుడు ఉన్నదానిని సరిగ్గా ఉపయోగించేవానికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. వాళ్లకి ఎంతో సమృద్ధి ఉంటుంది. కానీ తన దగ్గర ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉపయోగించని వాడి దగ్గరనుండి వాడికి ఇంతకు ముందు ఉన్నది కూడా తీసేస్తాడు. 30 ఆ పనికిమాలిన సేవకుణ్ణి బయట చీకటిలోకి విసిరేయండి. అక్కడ హాహాకారాలు చేస్తూ బాధలు తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటున్నవారితో ఉంటాడు."

31 "మనుష్యకుమారుడు తన అద్భుతమైన కాంతితో తన దూతలందరితో తిరిగివచ్చి మహా రాజుగా సింహాసనం మీద కూర్చుని ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడు. 32 ప్రజలందరూ సమూహాలుగా ఆయన ముందు నిలబడతారు. అప్పుడు ఒక గొల్లవాడు మేకలనూ గొర్రెలనూ వేరు చేసినట్టు వాళ్ళని వేరుచేస్తాడు. 33 ఆయన మంచివాళ్ళని కుడివైపూ, చెడ్డవారిని ఎడమవైపూ నిలబెడతాడు."

34 "అప్పుడాయన, కుడివైపున ఉన్నవాళ్ళతో, "నా తండ్రి ఆశీర్వదించిన వాళ్లలారా రండి, లోకాన్ని సృష్టించినప్పటినుండీ మీకోసం సిద్ధం చేస్తున్న మంచి వాటన్నిటినీ, ఆయన రాజ్యాన్నీ మీరు స్వాధీనం చేసుకోండి. 35 ఇవన్నీ మీకోసమే, ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళిచ్చారు. మీ ఊరికి కొత్తగా వస్తే నన్ను పిలిచి మీ ఇళ్ళల్లో ఉండనిచ్చారు. 36 నాకు వేసుకోడానికి బట్టలు లేకపోతే మీరు బట్టలు ఇచ్చారు, నాకు జబ్బు చేస్తే నాగురించి శ్రద్ధ తీసుకున్నారు. నేను జైల్లో ఉంటే, వచ్చి నన్ను పరామర్శించారు" అంటాడు."

37 "అప్పుడు మంచివాళ్ళు అని దేవుడు పిలిచినవాళ్ళు, "ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేస్తే మేము తినడానికి ఇచ్చాం? ఎప్పుడు దాహం వేస్తే తాగడానికి నీళ్ళిచ్చాం? 38 ఎప్పుడు మా ఊరికి నువ్వు కొత్తగా వస్తే మేము మా ఇంట్లో ఉండనిచ్చాం? ఎప్పుడు నీకు వేసుకోడానికి బట్టలు లేకపోతే బట్టలిచ్చాం? 39 ఎప్పుడు నువ్వు జబ్బు పడ్డావు? ఎప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు? ఎప్పుడు మేము నిన్ను పరామర్శస చేశాం? ఇవేమీ మాకు గుర్తు లేవే!" అంటారు. 40 అప్పుడు రాజు ఇలా అంటాడు, "మీ సహ విశ్వాసులు ఎవరికైనా, లోకంలో బీదా బిక్కీకి ఇలా చేసినా కచ్చితంగా మీరు నాకు చేసినట్టే."

41 "అయితే రాజు ఎడమవైపు ఉన్నవారిని చూసి, "దేవుడు శపించిన వాళ్ళలారా, నన్ను వదిలిపొండి. దేవుడు సాతానుకూ, అతని దూతలకూ సిద్ధం చేసిన నిత్యం మండే అగ్నిగుండంలోకి పొండి. 42 మీకు అదే సరైంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు తాగడానికి ఏమీ ఇవ్వలేదు. 43 మీ ఊరికి కొత్తగా వస్తే మీ ఇంట్లోకి నన్ను రానీయలేదు, నేను వేసుకోడానికి బట్టలు లేకుండా ఉంటే నాకు బట్టలియ్యలేదు, నేను జబ్బు పడ్డప్పుడూ, జైల్లో ఉన్నప్పుడూ కూడా నన్ను చూడ్డానికి రాలేదు" అంటాడు."

44 "అప్పుడు వాళ్ళు, "ప్రభూ, నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే మేం భోజనం పెట్టలేదు? ఎప్పుడు దాహంగా ఉంటే మేం నీళ్ళివ్వలేదు? ఎప్పుడు కొత్తగా ఊరికొస్తే మా ఇంట్లోకి రానివ్వలేదు? ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే మేం నీకు బట్టలివ్వలేదు? నువ్వెప్పుడు జబ్బుగా ఉంటే, ఎప్పుడు జైల్లో ఉంటే మేము పరామర్శించలేదు?" అని అడుగుతారు."

45 "ఆయన వాళ్లకి ఇలా జవాబిస్తాడు, "నిజానికి నా ప్రజలకూ, ఆఖరికి మీ దగ్గర ఉన్న బీదా బిక్కీకీ ఎలాంటి సాయం చేసినా అది కచ్చితంగా నాకు చేసినట్టే. మీరు వాళ్లకి చేయలేదు కాబట్టి నాక్కూడా మీరు చేయనట్టే."

46 "కాబట్టి నా ఎడం వైపు ఉన్నవాళ్ళు దేవుని నిత్య శిక్ష అయిన అగ్నిగుండంలోకీ, నా కుడివైపు ఉన్నవాళ్ళు దేవునితో కలిసి నిత్యం నివసించే పరలోకానికీ వెళ్ళండి."