26
1
యేసు ఈ విషయాలన్నీ చెప్పడం ముగించిన తరవాత, తన శిష్యులతో ఇలా అన్నాడు,
2
"రెండు రోజుల తరవాత మనం పస్కా పండగ చేసుకుంటామని మీకు తెలుసు కదా. ఆ సమయంలోనే మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు."
3
అదే సమయంలో ముఖ్య యాజకులూ, యూదు పెద్దలూ కైఫా అనే ప్రధాన యాజకుడి ఇంట్లో సమావేశమయ్యారు.
4
అక్కడ వాళ్ళు యేసుని ఎలా మోసపూరితంగా, యుక్తిగా పట్టుకుని చంపాలో పథకం రచించారు.
5
అయితే "ఇది పస్కా పండుగ సమయం. మనం ఆ పని ఇప్పుడు చేస్తే ప్రజల్లో అల్లర్లు జరగవచ్చు" అని తమలో తాము అనుకున్నారు.
6
యేసు, ఆయన శిష్యులు, బేతనియ గ్రామంలో సీమోను ఇంట్లో భోజనం చేస్తున్నారు. యేసు ఇంతకు ముందు సీమోనుకు ఉన్న కుష్టరోగాన్ని బాగుచేశాడు.
7
వాళ్ళు భోజనం చేస్తుండగా ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చింది. ఆమె అందమైన, రాతితో చేసిన ఒక కూజాలో చాలా ఖరీదైన అత్తరును పట్టుకొచ్చింది. ఆమె యేసు భోజనం చేస్తూ ఉండగా, ఆయన దగ్గరకి వెళ్ళి, తలమీద నుండి ఆ అత్తరును పోసింది.
8
అది చూసి శిష్యులకు చాల కోపం వచ్చింది. వాళ్ళలో ఒకడు, "ఈ అత్తరు ఇలా వృధా చేయడం ఏమిటి? ఇది చాలా ఘోరం. ఎంతో నష్టం.
9
దీన్ని గనక మనం అమ్మి ఉంటే ఎంతో డబ్బు వచ్చేది. అప్పుడది పేదవాళ్ళకు దానం చేసేవాళ్ళం కదా!" అన్నాడు.
10
వాళ్ళు అంటున్న మాటలు యేసు గ్రహించి, "ఈ స్త్రీని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నాకోసం ఎంతో అద్భుతమైన పని చేసింది.
11
పేదవాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉంటారని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి మీరు సాయం చేయొచ్చు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను."
12
"ఈమె ఈ అత్తరును నా శరీరంపై పోయడం ఎలా ఉందంటే నేను తొందరలో చనిపోతున్నానని ఈమెకు తెలిసిందేమో అన్నట్టుగా ఉంది. అంతే కాదు, ఈ అత్తరు నాపై పోసి నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది.
13
ఈ లోకంలో నా గురించిన సువార్త ప్రకటిస్తున్నప్పుడెల్లా ఈమె చేసిన పని గుర్తు చేసికొని ఈమెనూ, ఈమె చేసిన పనినీ లోకమంతా ప్రశంసిస్తుంది" అన్నాడు.
14
అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
15
అతడు వారిని, "ఒకవేళ నేను యేసును మీకు పట్టిస్తే, మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు?" అని అడిగాడు. వాళ్ళు అతనికి ముప్ఫై వెండి నాణేలు ఇవ్వడానికి ఒప్పుకుని ఆ నాణేలు లెక్కబెట్టి అతనికి ఇచ్చారు.
16
అప్పటినుండి యూదా ఆయన్ని వాళ్ళకి పట్టిచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
17
వారమంతా జరిగే పొంగని రొట్టెల పండగ మొదటి రోజున శిష్యులు యేసు దగ్గరకి వచ్చి, "మనం కలిసి పస్కా పండుగ భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?" అని అడిగారు.
18
యేసు, శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వాళ్ళేం చేయాలో చెప్పాడు. వారితో, "మీరు పట్టణంలోని పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో, "సమయం దగ్గర పడుతోంది. నేను నా శిష్యులతో కలిసి మీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను. భోజనం తయారు చేయడానికి ఈ ఇద్దరినీ పంపుతున్నాను" అని మా గురువు చెబుతున్నాడు అని చెప్పండి" అన్నాడు.
19
యేసు చెప్పినట్టుగా ఆ శిష్యులు చేశారు. వాళ్ళు వెళ్ళి అతని ఇంట్లో యేసు ఆజ్ఞాపించినట్టుగా పస్కా భోజనం తయారు చేశారు.
20
యేసు సాయంకాలం తన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు.
21
వారందరూ కలిసి భోజనం చేస్తుండగా ఆయన, "జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న ఒకడు కచ్చితంగా నన్ను శత్రువులకు అప్పగిస్తాడు" అన్నాడు.
22
శిష్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళలో ప్రతి ఒక్కడూ "ప్రభువా, అది నేనా?" అని అడగటం మొదలుపెట్టారు.
23
అప్పుడాయన, "నాతోబాటు భోజనం పాత్రలో చేయి పెట్టి, భోజనం చేస్తున్నవాడే కచ్చితంగా నన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడు.
24
మనుష్యకుమారుడు చనిపోవడం ఖాయం. ఎందుకంటే లేఖనాలు కూడా నా గురించి ఆ విషయాన్ని చెబుతున్నాయి. అయితే, నన్ను శత్రువుల చేతికి అప్పగించిన మనిషికి మాత్రం ఘోరమైన శిక్ష పడుతుంది. అతనికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టకపోయి ఉంటే ఎంతో బాగుండేది" అని జవాబిచ్చాడు.
25
అప్పుడు, ఆయన్ని అప్పగింపబోతున్న యూదా, ఆయనతో, "బోధకా, కచ్చితంగా నేను కాదు కదా?" అన్నాడు. యేసు అతనితో "నువ్వు చెప్పకనే చెప్తున్నావు కదా" అని అన్నాడు.
26
భోజనం చేస్తుండగా, యేసు ఒక రొట్టె తీసుకుని, దేవునికి స్తుతులు చెప్పి దాన్ని విరిచి ముక్కలు చేసి, తన శిష్యులకు ఇస్తూ, "ఈ రొట్టెను తీసికొని తినండి. ఇది నా శరీరం" అన్నాడు.
27
తరవాత ద్రాక్షరసం పాత్రను పట్టుకుని దేవునికి స్తుతులు చెప్పి వాళ్ళకిచ్చి, "మీరందరూ ఈ పాత్రలో ఉన్నది తాగండి.
28
ఈ ద్రాక్ష రసం నా రక్తం. తొందరలోనే నా శరీరం నుండి నేనే దాన్ని చిందింపబోతున్నాను. ఈ రక్తం ప్రజలందరి పాపక్షమాపణకు గుర్తుగా దేవుడు చేసిన కొత్త ఒడంబడిక.
29
జాగ్రత్తగా వినండి. ఒక కొత్త అర్థంతో ఈ విధంగా మీతో కలిసి మళ్ళీ ద్రాక్షరసం తాగేంత వరకు నేను దాన్ని తాగను. ఆ విధంగా నా తండ్రి పరిపాలనలోనే జరుగుతుంది" అన్నాడు.
30
తరవాత వాళ్ళు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు బయలుదేరారు.
31
వెళ్ళే దారిలో యేసు వారితో ఇలా చెప్పాడు, "ఈ రాత్రి నాకు జరిగేదాన్ని బట్టి మీరంతా నన్ను వదిలి పారిపోతారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే, "నేను కాపరిని దెబ్బ తీస్తాను. మందలోని గొర్రెలన్నిటినీ చెదరగొడతాను" అని లేఖనాల్లో దేవుడు రాయించి ఉంచాడు కదా.
32
అయితే నేను మరణం నుండి తిరిగి లేచిన తరవాత మీకంటే ముందుగా గలలియకు వెళతాను."
33
అప్పుడు పేతురు, "మిగిలిన శిష్యులందరూ నీకు జరిగిన దాన్ని చూసి వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం కచ్చితంగా నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను" అన్నాడు.
34
యేసు అతనితో, "నిజమేమిటంటే, ఈ రాత్రే కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడు సార్లు చెప్తావు" అన్నాడు.
35
పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నేను మాత్రం నిన్ను ఎరుగను అని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఇదే విషయం చెప్పారు.
36
యేసు శిష్యులతో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. అక్కడ వారితో, "నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరిక్కడే ఉండండి" అని చెప్పి,
37
పేతురు, యాకోబు, యోహానులను తనతోబాటు తీసుకెళ్ళాడు. ఆయన తీవ్రమైన దుఖంతో, కలతతో నిండిపోయాడు.
38
తరవాత ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది. మీరిక్కడే నాతోబాటు మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
39
ఆయన కొంత దూరం వెళ్ళి, నేలమీద సాష్టాంగపడి ముఖం నేలమీద ఆనించి, "నా తండ్రీ, వీలైతే ఇలా శ్రమ పడకుండా చేయి. కానీ నా ఇష్ట ప్రకారం కాక నీ ఇష్ట ప్రకారమే చేయి" అని ప్రార్థించాడు.
40
తరవాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి, వాళ్ళు నిద్ర పోతుండగా చూసి, "నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు నిద్ర పోతుంటే, నాకు చాలా నిరుత్సాహంగా ఉంది.
41
ఎవ్వరూ పాపం గురించి మిమ్మల్ని పరీక్షకు గురి చేయకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నేను చెప్పేది చేయాలనుకుంటున్నారు గానీ తీరా చేయబోయేటప్పటికి మీకు శక్తి చాలడం లేదు" అని అన్నాడు.
42
రెండో సారి మళ్ళీ దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను శ్రమ పడడం తప్పని సరి అయితే, నీ ఇష్టమే జరగనివ్వు" అని ప్రార్థించాడు.
43
ఆయన ఆ ముగ్గురు శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ నిద్ర పోవడం చూశాడు. వాళ్ళు కళ్ళు తెరవలేకపోతున్నారు.
44
కాబట్టి వాళ్ళనలా వదిలేసి ఆయన మళ్ళీ దూరంగా వెళ్ళి మూడో సారి కూడా ఇంతకు ముందు లాగానే ప్రార్థన చేశాడు.
45
అప్పుడాయన తిరిగి తన శిష్యుల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, "మీరింకా నిద్ర పోవడం చూస్తే నాకు నిరుత్సాహంగా ఉంది. చూడండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
46
లేవండి, ఇక వెళ్దాం. మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. అదిగో, నన్ను పట్టించేవాడు వస్తున్నాడు."
47
యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగానే, పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా యేసును శత్రువుల చేతికి అప్పగించడానికి వచ్చాడు. అతనితో బాటు కత్తులూ కర్రలూ పట్టుకుని పెద్ద గుంపు కూడా ఉంది. వారిని ముఖ్య యాజకులూ, ఇతర పెద్దలూ పంపారు.
48
"నేనేవరికైతే ముద్దు పెడతానో అతణ్ణి పట్టుకోమ" ని యూదా వాళ్ళకి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
49
అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి, "బోధకా, నీకు శుభం" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
50
యేసు అతనితో, "మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది తొందరగా చేయి" అన్నాడు. వెంటనే యూదాతో ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి, ఆయన్ని ఒడిసి పట్టుకున్నారు.
51
అకస్మాత్తుగా యేసుతో ఉన్నవాళ్ళలో ఒకడు ఒరలోనుండి కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి చంపాలనుకున్నాడు గానీ అతని చెవిని మాత్రమే తెగనరికాడు.
52
యేసు అతనితో, "కత్తిని ఒరలో పెట్టేయ్. కత్తి వాడాలనుకున్న వారంతా కత్తితోనే నశించిపోతారు.
53
ఇప్పుడు గనక నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు వ్యూహాల సైన్యాలకంటే ఎక్కువమంది దూతల్ని పంపలేడని మీరనుకుంటున్నారా?
54
నేను అలా వేడుకుంటే మెస్సీయకు ఈ విధంగా జరుగుతుందని ప్రవక్తలు రాసిన మాటలు ఎలా నెరవేరతాయ్?" అన్నాడు.
55
యేసు తనను ముట్టడించిన గుంపును చూసి, "మీరు నన్ను ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులు, కర్రలతో ఇప్పుడు వచ్చారే, ప్రతి రోజూ కోవెలలో కూర్చుని బోధించినప్పుడు మీరెందుకు నన్ను పట్టుకోలేక పోయారు?
56
అయితే, లేఖనాల్లో ప్రవక్తలు రాసిన ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది కాబట్టి ఇదంతా జరిగింది" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.
57
యేసును బంధించిన మనుషులు ఆయన్ని ప్రధాన యాజకుడు కైఫా ఇంటికి తీసుకొచ్చారు. యూదు ధర్మశాస్త్రాన్ని బోధించేవారూ, పెద్దలూ అందరూ అప్పటికే అక్కడికి చేరుకున్నారు.
58
పేతురు దూరంగా ఉండి, యేసును వెంబడిస్తూ ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. అక్కడ సైనికులతో బాటు కూర్చొని ఏమి జరుగుతుందో అని చూస్తూ ఉన్నాడు.
59
ప్రధాన యాజకుడూ, మిగిలిన యూదు మహాసభ పండితులూ, పెద్దలూ యేసును చంపించాలని దొంగ సాక్ష్యం చెప్పే వ్యక్తుల కోసం వెదుకుతూ ఉన్నారు.
60
చాలా మంది అబద్ద సాక్ష్యాలు చెప్పారు కానీ వాళ్ళకి ఉపయోగకరమైనది ఒక్కటీ లేదు. చివరికి ఇద్దరు మనుషులు ముందుకు వచ్చారు.
61
వాళ్ళు "ఈ మనిషి, "నేను దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి కడతాను" అని చెప్పాడు" అన్నారు.
62
అప్పుడు ప్రధాన యాజకుడు నిలబడి యేసుతో, "నువ్వు జవాబు చెప్పదలచుకోలేదా? వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు నీ జవాబు ఏమిటి?" అని అడిగాడు.
63
అయితే యేసు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ప్రధాన యాజకుడు ఆయనతో, "నిజం చెప్పమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మహా శక్తిమంతుడైన దేవుడు వింటున్నాడు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా?" అని అడిగాడు.
64
యేసు, "అవును, నువ్వే అన్నావు గదా, అయితే మీకందరికీ చెప్తున్నాను, ఒకానొక రోజు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుడైన దేవుని పక్కన కూర్చుని పరిపాలన చేయడం చూస్తారు. అంతేగాక ఆయన ఆకాశమేఘాల మీద ఆసీనుడై తిరిగిరావడం మీరు చూస్తారు" అన్నాడు.
65
ప్రధాన యాజకుడు కోపంతో ఊగిపోతూ తన పైవస్త్రాన్ని చింపేసుకున్నాడు. "ఇతడు దేవుడినే అవమానించాడు. తనను తాను దేవునితో సమానం చేసుకున్నాడు. ఇంకా వేరే సాక్ష్యాలతో పని లేదు. ఇతడేమి చెప్పాడో మీరే విన్నారు కదా.
66
మీరేమంటారు?" అని సభవారిని అడిగాడు. వాళ్ళు, "మన చట్టాల ప్రకారం ఇతడు దోషి. చావుకు తగినవాడు" అన్నారు.
67
వెంటనే కొంతమంది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. కొందరు పిడికిలితో గుద్దారు. కొందరు చెంపల మీద కొట్టారు.
68
"నువ్వు క్రీస్తువని చెప్పుకుంటున్నావు కదా, నిన్నెవరు కొట్టారు చెప్పు" అన్నారు.
69
పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతణ్ణి చూసి, "నువ్వు కూడా గలలియ జిల్లావాడైన యేసుతో ఉండేవాడివే కదా?" అంది.
70
అక్కడ ఉన్న అందరూ వింటూ ఉండగా పేతురు, "లేదు లేదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకేమీ తెలియదు" అన్నాడు.
71
అతడు వసారాలో నుండి లేచి గేటు దగ్గరకి వెళ్ళాడు. అప్పుడు ఇంకొక పనిపిల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో, "ఈ మనిషి నజరేతు వాడైన యేసుతో ఉంటాడు" అంది.
72
కానీ పేతురు మళ్ళీ దాన్ని అంగీకరించలేదు. "నేను అబద్ధం చెప్తే గనక దేవుడు నన్ను శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలీదు" అన్నాడు.
73
కొంతసేపైన తరవాత అక్కడ నిలబడిన కొంతమంది పేతురు దగ్గరికి వచ్చి, అతనితో, "నువ్వు కచ్చితంగా ఆ మనిషితో ఉన్నవాడివే. నువ్వు గలలియ వాడివని నీ యాసను బట్టి మాకర్ధమై పోతుంది" అన్నారు.
74
ఇక దాంతో పేతురు ఒట్లు, శాపనార్థాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, "నేను నిజమే చెబుతున్నాననే దానికి పరలోక దేవుడే సాక్షి. ఆ మనిషి నాకు తెలియనే తెలియదు" అన్నాడు. వెంటనే కోడి కూసింది.
75
అప్పుడు పేతురు, "కోడి కూయక ముందే నువ్వు మూడుసార్లు నేను ఎవరో తెలియదని చెబుతావు" అన్న యేసు మాటలు గుర్తు తెచ్చుకొని, వసారా బయటికి వెళ్ళి తాను చేసిన దానికి ఎంతో దుఖంతో పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాడు.