24

1 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో నడుస్తూ, ఈ దేవాలయ భవనాలు ఎంత అందంగా ఉన్నాయో అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. 2 అప్పుడాయన, "మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భవనాల గురించి ఒక నిజాన్ని చెబుతున్నాను వినండి. ఒక సైన్యం వీటిని కచ్చితంగా సమూల నాశనం చేసేస్తుంది. ఈ భవనాల్లో ఉన్న ప్రతీ రాయినీ ఒకదానిపై ఒకటి ఉండకుండా కూలగొట్టేస్తారు" అని వారితో అన్నాడు.

3 తరువాత, యేసు ఒలీవకొండ మీద ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో శిష్యులు ఆయన దగ్గరికెళ్ళి, "కోవెల గురించి నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమి జరుగుతుంది? లోకాంతం అయ్యేటప్పుడు ఎలా తెలుస్తుంది? మాకు చెప్పు" అని అడిగారు.

4 యేసు, "నేను చెప్పేదేమిటంటే లోకాంతంలో ఏమి జరుగుతుంది అనే విషయాల్లో ఎవ్వరు మిమ్మల్నిమోసం చేయకుండా చూసుకోండి! 5 చాలా మంది నా పేరు చెప్పి వచ్చి "నేనే క్రీస్తుని" అని చెబుతారు. మరీ ముఖ్యంగా, "నేనే మెస్సీయని" అని చెబుతారు. అలా వాళ్ళు చాలా మందిని దారి తప్పేలా చేస్తారు."

6 "మీరు యుద్ధాల గురించీ, యుద్ధ వార్తల గురించీ వింటారు. కాబట్టి మీరు కంగారు పడకండి. ఇవన్నీ జరిగి తీరాలని దేవుడే చెప్పాడని మనసులో ఉంచుకోండి. అయితే ఇవి జరిగినప్పుడు లోకం అంతమయ్యే కాలం వచ్చేసిందని మాత్రం కాదు. అంతం వెంటనే రాదు. 7 మనుషుల్లో గుంపుల మధ్య ఘర్షణలూ, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం కాలు దువ్వడాలూ, కరవులూ, భూకంపాలూ కలుగుతాయి. 8 ఇవన్నీ బిడ్డ పుట్టటానికి ముందు గర్భిణీ స్త్రీకి వచ్చే ప్రసూతి నొప్పుల్లాటివి. ఇవి కష్టాలకు ఆరంభం మాత్రమే."

9 "చాలా ఘోరాలు జరుగుతాయి. మనుషులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు. మీరు నన్ను విశ్వసించడం వల్ల నా గురించి మనుషులంతా మిమ్మల్ని అసహ్యించుకుంటారు. 10 అంతే కాదు, ఆ హింసలు చూసి అనేకమంది వెనక్కి తగ్గుతారు. వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని తమ సాటి విశ్వాసుల్ని శత్రువులకు పట్టిస్తారు. 11 కపట ప్రవక్తలు అనేకమంది వచ్చి, ప్రవక్తలం అని అబద్ధాలు చెప్పి ఎంతో మందిని మోసం చేస్తారు."

12 "దేవుని ఆజ్ఞలకు లోబడక పోవడం వల్ల ఎక్కువమందిలో అన్యాయం పెరిగిపోయి విశ్వాసులు చాలామందిలో ప్రేమ అణగారిపోతుంది. ఒకరి నొకళ్ళు ప్రేమించుకోవడం మానేస్తారు. 13 అయితే ఎవరు చివరి వరకు దేవునిపై నమ్మకం ఉంచి నిలబడతారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. 14 రాబోయే రోజుల్లో దేవుడు లోకాన్నంతటినీ ఎలా పరిపాలిస్తాడో తెలిపే శుభవార్తను విశ్వాసులు లోకమంతా తెలియజేస్తారు. ఆ తరవాత లోకం అంతరించిపోతుంది."

15 "అయితే, లోకం అంతరించక ముందు ఒక అసహ్యాన్ని పుట్టించే వినాశనకారి పరిశుద్ధ దేవాలయాన్ని మైలపడేలా చేసే ఒక హేయమైన వస్తువును దేవాలయంలో ఉంచి ప్రజలను లోపలి రాకుండా అడ్డుకుంటాడు. దీనిగురించి చాలా కాలం క్రితమే దానియేలు ప్రవక్త రాశాడు. ఇప్పుడు దీన్ని చదువుతున్న వారందరూ ఒకసారి దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఇది నా హెచ్చరిక. 16 దేవాలయంలో ఇలా జరగ్గానే యూదా ప్రాంతంలో ఉన్నవాళ్ళందరూ ఎత్తైన కొండలకి పారిపోవాలి. 17 పారిపోయే ముందు ఇంటి బయట ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోడానికి లోపలి వెళ్ళకూడదు. 18 పొలంలో పని చేసేవాళ్ళు పారిపోయే ముందు తమ బట్టలు తీసుకెళ్ళడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు."

19 "అయ్యో, ఆ రోజుల్లో గర్భవతుల పరిస్థితీ, చంటిపిల్లల తల్లుల పరిస్థితీ ఎంత ఘోరంగా ఉంటుందో! ఎందుకంటే వాళ్ళు మహా బాధలకు గురౌతారు. వాళ్ళకి పారిపోవడం ఎంతో కష్టం. 20 ఆ పారిపోయే సమయం శీతాకాలం గానీ, విశ్రాంతి దినం గానీ రాకుండా చూసుకోండి. 21 ఎందుకంటే ఆ సమయంలో మనుషులందరూ తీవ్రమైన శ్రమలకు గురౌతారు. సృష్టి మొదలైనప్పటి నుంచీ ఇంత బాధలు ఎప్పుడూ పొందలేదు, భవిష్యత్తులో పొందరు కూడా. 22 దేవుడు గనుక ఆ రోజుల్ని తగ్గించకపోతే ప్రతి ఒక్కళ్ళూ చనిపోతారు. అయితే ఆయన ఎన్నుకున్న ప్రజల కోసం ఆ రోజులు తగ్గించడానికి తీర్మానించుకున్నాడు."

23 "ఆ సమయంలో మీతో ఎవరైనా, ఇదిగో మెస్సీయ ఇక్కడ ఉన్నాడనీ, అదుగో అక్కడ ఉన్నాడనీ మీతో చెప్తే మీరు నమ్మవద్దు. 24 వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి రక రకాల అద్భుతాలూ, నోరు వెళ్ళబెట్టి చూసే ఎన్నెన్నో మాయలూ, మీ కళ్ళముందు కనపరుస్తారు. ఆఖరికి దేవుడెన్నుకున్న మిమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. 25 ఇదిగో, ఇవన్నీ జరక్క ముందే నేను మీతో చెబుతున్నానని మర్చిపోవద్దు."

26 "కాబట్టి ఎవరైనా మీతో, ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడనీ, గది లోపల ఉన్నాడనీ చెప్పినా సరే మీరు నమ్మొద్దు. 27 మెరుపు తూర్పున తళుక్కుమని మెరిసి పడమర వైపు అందరూ చూసేటట్టు ఎలా కన్పిస్తుందో, అలాగే మనుషకుమారుడి రాక ఉంటుంది. 28 రాబందులన్నీ ఒకే చోట పోగైతే ఎదో ఒక జంతు కళేబరం అక్కడ ఉండి ఉంటుందని సులువుగా తెలిసినట్టే. ఆయన రాక అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. 29 మనుషులకు బాధలు అయ్యిపోయిన వెంటనే సూర్యుని చీకటి కమ్ముతుంది. చంద్రుడు ఇంక కాంతిని ఇవ్వలేడు. ఆకాశం నుండి నక్షత్రాలన్నీరాలిపోతాయి. ఆకాశంలో ఉన్నవస్తువుల స్థానాలన్నిటినీ దేవుడు కదిలించేస్తాడు."

30 "తరువాత, ఆకాశంలో మనుషకుమారుడు వచ్చే కదలికలు అందరూ స్పష్టంగా చూస్తారు. భూమి మీద ఉన్న ఆయన్ని నమ్మని అన్నిరకాల జాతుల ప్రజలూ ఆయన్ని చూసి గుండెలు బాదుకుని ఏడుస్తారు. వాళ్ళు మనుషకుమారుడు మేఘాల్లో, మహా శక్తితో, మహా మహిమతో రావడం చూస్తారు. 31 ఆయన పరలోకం నుండి తన దూతల్ని భూమి నాలుగు పక్కలకి పంపుతాడు. ఆ దూతలు గొప్ప బూర శబ్దం వినీ వినగానే భూమి మీద దేవుడు ఎన్నుకొన్నఆయన ప్రజలందర్నీ ఒకచోటికి సమకూరుస్తారు."

32 "అంజూరుు చెట్టు ఎదిగే విధానం గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకోండి. దాని కొమ్మలు లేతగా ఉండి దాని ఆకులు చిగిరిస్తూ ఉంటే గనక వేసవి కాలం దగ్గర పడిందని అర్థం అవుతుంది. 33 అలాగే మీరు ఈ సంగతులన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన రాక సమీపంగా ఉందని మీరు గ్రహించాలి."

34 "ఈ సంగతులన్నీ ముందునుండీ గమనించిన వాళ్ళు చనిపోక ముందే ఇవన్నీ జరుగుతాయని కచ్చితంగా చెబుతున్నాను. 35 నేను చెప్పిన ఈ సంగతులు కచ్చితంగా జరగబోతున్నాయి. ఆకాశమూ, భూమీ ఒకానొక రోజు గతించిపోతాయి గానీ, నేను చెప్పే మాటలు మాత్రం ఎప్పుడూ నిజమౌతాయి."

36 "అయితే ఇదెప్పుడు జరుగుతుంది అనే విషయం, అంటే, ఆ రోజు గానీ ఆ గంట గానీ, ఏ మనిషికీ గానీ, పరలోకంలో ఉన్న దూతలకు గానీ, చివరికి కుమారుడికి కూడా తెలియదు. ఒక్క తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు."

37-39 "నోవహు జీవించిన రోజుల్లో ఎలా ఉండేదో అలాగే రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నది. ఆ మనుషులకు జలప్రళయం వచ్చేవరకు కూడా తమకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనే ఆలోచన కూడా లేదు. ఎప్పటి లాగానే వాళ్ళు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తల్లిదండ్రులు వారి కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు. నోవహు, అతని కుటుంబం, ఓడలోకి వెళ్ళే రోజు వరకు కూడా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి ఓడలో ఉన్నవారు తప్ప మిగిలినవాళ్ళంతా కొట్టుకుపోయే వరకూ వాళ్ళ కళ్ళు తెరుచుకోలేదు. అచ్చం అలాగే దేవుని నమ్మని వాళ్ళు కూడా మనుష కుమారుని రాకను తెలుసుకోలేరు."

40 "ఆయన రాక సంభవించినప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళలేరు. ఉదాహరణకు, పొలంలో ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళలో ఒక్కడు మాత్రమే వెళ్ళిపోతాడు. ఇంకొకడు శిక్ష పొందడానికి మిగిలిపోతాడు. 41 అలాగే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తిరగలి విసురుతూ ఉండగా ఒకామె వెళ్ళిపోతుంది. ఇంకొకామె మిగిలిపోతుంది. 42 కాబట్టి ఏరోజున ప్రభువు భూమి మీదకు వస్తాడో మీకు తెలియదు కాబట్టి అన్ని సమయాల్లో మెలకువగా ఉండండి."

43 "దొంగలు రాత్రి ఏ సమయంలో వస్తారో ఆ ఇంటి యజమానికి తెలిసిపోతే, అతడు మెలకువగా ఉండి, దొంగతనం చేయనివ్వడు కదా! అలాగే మనుష్యకుమారుడు అనుకోని సమయంలో ఒక దొంగ లాగా వస్తాడు. 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్యకుమారుడు భూమి మీదకి వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి."

45 "ఒక నమ్మకమైన, తెలివైన సేవకుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న ఒక సేవకుణ్ణి, మిగిలిన సేవకులందరి మీదా మేనేజర్ గా నియమించాడు. అతడు వారందరికీ సమయానికి భోజనం పెట్టమని చెప్పాడు. తరవాత అతడు దూర ప్రయాణమై పోయాడు. 46 యజమాని చాలా కాలం తరవాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు తన పని నమ్మకంగా చేసినట్టు గమనిస్తే అతడు చాలా సంతోషిస్తాడు. 47 అతడు ఆ సేవకుణ్ణి తన ఆస్తి అంతటి మీదా మేనేజర్ గా నియమిస్తాడు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను."

48 "అయితే అలా కాకుండా, అతడు ఒక దుష్టుడైన కపట సేవకుడైతే తనలో తాను, "ఆ, ఏముందిలే, నా యజమాని చాలా దూరం ప్రయాణమై వెళ్ళాడు, ఇప్పట్లో రాడు, నేనేమి చేసినా అతడు కనుక్కోలేడు" అనుకొని 49 తన తోటి సేవకులందరినీ కొడుతూ తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ జల్సా చేస్తూ ఉంటాడు. 50 అప్పుడు అతడు ఊహించని సమయంలో, అతడు ఎదురు చూడని రోజున అతని యజమాని తిరిగి వస్తాడు. 51 అతడు ఆ సేవకుణ్ణి చూసి, కఠినంగా శిక్షించి కపట వేషధారులుండే చోట అతణ్ణి పడవేస్తాడు. అక్కడి మనుషులు యాతన తట్టుకోలేక ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు."