13

1 అదే రోజు యేసు అప్పటి వరకూ బోధిస్తున్న ఇంట్లోనుంచి గలిలయ సరస్సు తీరానికి వెళ్ళి, అక్కడ కూర్చున్నాడు. 2 జనం చాలా పెద్ద గుంపుగా ఆయన ఉపదేశం వినడానికి ఆయన చుట్టూ చేరారు. ఆయన ఒక పడవ ఎక్కి బోధించడానికి కూర్చున్నాడు. జనం మాత్రం ఒడ్డున ఉండి, ఆయన చెప్పింది విన్నారు.

3 ఆయన చాలా ఉదాహరణలు ఉపయోగిస్తూ వాళ్లకి బోధించాడు. ఆయన చెప్తూ, "వినండి! ఒక మనిషి విత్తనాలు చల్లడానికి పొలం వెళ్ళాడు. 4 నేలపై విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి. కొన్ని పిట్టలు వచ్చి ఆ విత్తనాల్ని తినేశాయి. 5 కొన్ని విత్తనాలు పై పైనే మట్టిపొర ఉన్న రాతి నేల మీద పడ్డాయి. అవి తొందరగా మొలకెత్తాయి. 6 అయితే మొలకల వేర్లు లోతుగా లేక ఎండ వేడికి ఎండిపోయాయి."

7 "కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. మొక్కలతో పాటు ముళ్ళకంపలు కూడా ఎదిగి మొక్కల్ని అణిచేసాయి. 8 మిగిలిన విత్తనాలు మంచి నేలపై పడి ఏపుగా ఎదిగి మంచి పంటనిచ్చాయి. విత్తిన దానికి నూరు రెట్లు ఫలసాయం ఇచ్చాయి. కొన్ని మొక్కలు అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఉత్పత్తి చేసాయి. 9 ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది ఆలోచిస్తారు" అన్నాడు.

10 తర్వాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు జనంతో మాట్లాడినప్పుడు ఉపమానాలు ఎందుకు వాడతావు?" అని అడిగారు. 11 ఆయన జవాబిస్తూ, "ఇంతకు ముందు మీకు దేవుడు బయలు పరచని విషయం ఇప్పుడు ఆయన పరలోకం నుండి ఎలా ఏలుతాడో బయలుపరుస్తున్నాడు. కానీ ఇవి ఇతరులకి బయలు పరచలేదు. 12 నేను చెప్పింది ఆలోచించి, అర్థంచేసుకుంటే దేవుడు ఇంకా ఎక్కువ అర్థం అయ్యేలా చేస్తాడు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోలేని వాళ్ళు ,వాళ్లకు తెలిసింది కూడా మర్చిపోతారు. 13 అందుకే నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు ఉపమానాలు వాడతాను. నేను చేసేవి వాళ్ళు చూసినా దాని వాళ్ళకి కాదు. నేను చెప్పేది వాళ్ళు వింటున్నా, దాని అసలు అర్థం చేసుకోలేరు" అన్నాడు.
14 పూర్వం యెషయా ప్రవక్త ద్వారా;
"నేను చెప్పింది మీరు వింటారు కానీ అర్థం చేసుకోలేరు.
నేను చేసేది చూస్తారు కాని అది ఏమిటో తెలుసుకోలేరు."
అని దేవుడు చెప్పింది పూర్తిగా నెరవేరేలా ఈ ప్రజలు చేస్తున్నారు.

15 దేవుడు యెషయాతో ఇలా కూడా చెప్పాడు;
"ఈ ప్రజలు నేను చెప్పింది వింటారు కానీ నా సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు.
వాళ్లకి చూడగల కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూసేది ఏమిటో స్పష్టంగా చూడలేరు.
వాళ్ళు కళ్ళు మూసేసుకున్నారు. వాళ్ళ కళ్ళతో చూడలేరు,
వాళ్ళ చెవులతో వినలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు.
వాళ్ళు చూడగలిగీ వినీ , అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు నావైపు తిరుగుతారు.
నేను వాళ్ళని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు."

16 "మిమ్మల్ని అయితే సామర్ధ్యంగల వాళ్ళుగా దేవుడు చేసాడు ఎందుకంటే మీరు నేను చేసేవి గ్రహించగలరు, నేను చెప్పేవి అర్థం చేసుకోగలరు. 17 ఇది గమనించండి. చాలా కాలం క్రితం బ్రతికిన చాలా మంది ప్రవక్తలూ నీతిమంతులూ నేను చేసేవీ మీరు చూస్తున్నవీ వాళ్ళు చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ చూడలేక పోయారు. నేను చెప్తుండగా మీరు వింటున్నది వాళ్ళు వినాలని ఎంతో అనుకున్నారు కానీ వాళ్ళు వినలేక పోయారు, మీరు వింటున్నారు."

18 ఇప్పుడు నేను వివరించే ఉపమానం వినండి. రకరకాల నేలల్లో విత్తనాలు విత్తిన మనిషి గురించిన ఉపమానం. 19 కొందరు దేవుడు ఏలడం గురించి వింటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు దారిలో పడిన విత్తనం లాంటి వాళ్ళు. సాతాను చెడ్డవాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి విన్నది మర్చిపోయేలా చేస్తాడు. 20 కొందరు దేవుని సందేశాన్ని ఆనందంతో అంగీకరిస్తారు. వాళ్ళు రాతి నేలపైన పడిన విత్తనం లాంటి వాళ్ళు. 21 వాక్యం వాళ్ళ హృదయం లోపలికి చొచ్చుకుపోక చాలా కొద్దికాలమే నమ్ముతారు. వాళ్ళు లోతుగా వేర్లు లేని వాళ్ళు. నేను చెప్పింది నమ్ముతారు కానీ ఇతరులు వాళ్ళని బాధపెట్టి, హింసించగానే వాళ్ళు విశ్వాసంలో ఉండక తోసిపుచ్చడం ద్వారా పాపం చేస్తారు.

22 కొందరు దేవుని సందేశం వింటారు. కానీ వాళ్ళు ధనవంతులుగా ఉండాలని బలంగా కోరిక ఉండి, డబ్బుతో ఏమి కొందామా అని ఆలోచిస్తూ కేవలం డబ్బు కోసమే ఆందోళన పడుతూ ఉంటారు. దాని ఫలితంగా దేవుని సందేశాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు చేయాలని దేవుడు ఆశించిన వాటిని చేయరు. వీళ్ళు ముళ్ళకంపల్లో పడిన విత్తనాల్లాంటి వాళ్ళు. 23 కొందరు నా సందేశాన్ని విని అర్థం చేసుకున్న వాళ్ళు. వీళ్ళల్లో కొందరు దేవుని సంతృప్తి పరచడానికి చాలా చేస్తారు. కొందరు దేవుని సంతోషపెట్టడానికి ఇంకా ఎక్కువ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువగా , కొందరు ఇంకా చాలా ఎక్కువగా దేవున్ని సంతోష పెట్టడానికి చేస్తారు. వీళ్ళు మంచి నేలపై పడిన విత్తనాల్లాంటి వాళ్ళు.

24 యేసు ఆ సమూహానికి ఇంకొక ఉపమానం చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడమనేది, ఒక రైతు పొలంలో మంచి విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. 25 అతని పనివాళ్ళు పొలం దగ్గర కాపలా కాయడానికి వెళ్ళి నిద్రపోతుండగా రైతు శత్రువు వచ్చి గోదుమల మధ్యలో కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళి పోయాడు. 26 ఆ మొక్కలు పచ్చగా పెరిగి కంకులు వేసి నప్పుడు కలుపు మొక్కలు కూడా పెరిగాయి. 27 రైతు పనివాళ్ళు వచ్చి, "అయ్యా! మీరు మాకు విత్తడానికి మంచి విత్తనాలే ఇచ్చారు. మేము ఆ విత్తనాలే చల్లాం కూడా. వాటిలో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అన్నారు. 28 "ఇది నా శత్రువు చేసిన పని" అని రైతు అన్నాడు. పనివాళ్ళు అతన్ని, "కలుపు మొక్కలు పీకేయమంటారా?" అని అడిగారు.

29 "ఆ పని మాత్రం చెయ్యొద్దు. పొరపాటున గోదుమ మొక్కలు కూడా మీరు పీకేయవచ్చు. 30 పంట కోసే కాలం వరకూ గోదుమ మొక్కల్ని , కలుపు మొక్కల్ని కూడా పెరగనివ్వండి. నేను పంట కొయ్యమని చెప్పినప్పుడు ముందు కలుపుమొక్కల్ని తీసి కాల్చేయడానికి కట్టలు కట్టండి. తరువాత గోదుమల్ని పోగుచేసి గిడ్డంగిలో పెట్టండి."

31 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక మనిషి పొలంలో నాటిన ఆవగింజ మొక్కలా ఉంటుంది. 32 మనుషులు విత్తే విత్తనాలు అన్నిటిలో ఆవగింజ చిన్నది. ఇశ్రాయేలు దేశంలో అవి చాలా పెద్ద మొక్కలుగా ఎదుగుతాయి. అవి పూర్తిగా ఎదిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో ఎత్తుగా అవుతుంది. చెట్లలా ఎదుగుతాయి. వాటి కొమ్మల్లో పక్షులు గూడు కట్టుకుంటాయి."

33 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక స్త్రీ చేస్తున్న రొట్టెలా ఉంటుంది. నలభై కిలోల పిండి తీసుకుని, అందులో చిటికెడు ఈస్ట్ కలిపినప్పుడు పిండి పొంగుతుంది."

34 యేసు ప్రజలకి ఉపమానాలు చెప్పి విషయాలన్నీ బోధించాడు. 35 అలా చెప్పడం వల్ల చాలా కాలం క్రితం ప్రవక్తల్లో ఒకరి ద్వారా దేవుడు చెప్పింది జరిగింది. "నేను ఉపమానాల్లో మాట్లాడతాను. నేను లోకం సృష్టించింది మొదలు నేను రహస్యంగా ఉంచింది ఉపమానాలుగా చెప్తాను."

36 యేసు జన సమూహాన్ని పంపేసిన తరవాత ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "గోదుమ పంటలో కలుపు మొక్కల గురించి వివరించు" అని అడిగారు. 37 ఆయన జవాబిస్తూ, మంచి విత్తనాలు విత్తే వాణ్ణి నేనే, మనుషకుమారుణ్ణి. 38 పొలం మనుషులు బ్రతుకుతున్న ఈ లోకాన్ని సూచిస్తుంది. బాగా పెరిగిన విత్తనాలు దేవుడు తండ్రిగా ఉన్నవాళ్ళను సూచిస్తాయి. కలుపు మొక్కలు సాతాన్నితండ్రిగా పెట్టుకున్న వాళ్ళని సూచిస్తాయి. 39 కలుపు మొక్కల విత్తనాలు చల్లిన శత్రువు సాతాన్నిసూచిస్తాడు. గోదుమ పంట కోసే సమయం యుగాంతాన్ని సూచిస్తుంది. పంట కోసే వాళ్ళు దేవ దూతల్ని సూచిస్తారు. 40 సేకరించిన కలుపు మొక్కల్ని కాల్చేశారు. అది యుగాంతంలో దేవుని తీర్పు సమయంలో ప్రజలకి జరిగేది సూచిస్తుంది.

41 అది ఇలా ఉంటుంది. "మనుష్యకుమారుణ్ణి అయిన నేను, నా దూతల్ని పంపుతాను. నేను ఏలుతున్న వాళ్ళందరిలో దేవుని చిత్తానికి భంగం కలిగించే వాళ్ళని, ఇతరులతో పాపం చేయించే వాళ్ళని దూతలు పోగుచేస్తారు. 42 వాళ్ళని దూతలు నరకంలోని మంటల్లోకి విసిరేస్తారు. అక్కడ వాళ్ళు నొప్పినీ బాధనూ భరించ లేక ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ ఉంటారు. 43 ఏది ఎలా ఉన్నా, ప్రభువుకు నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు మాత్రం సూర్యుడు ప్రకాశించినట్టు మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళు అలా మెరవడానికి కారణం వాళ్ళ తండ్రిగా ఉన్న దేవుడు వాళ్ళను ఏలుతాడు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి."

44 "పరలోకం నుండి దేవుడు ఏలడం చాలా విలువైంది. అది చాలా కాలం క్రితం ఎవరో దాచిపెట్టిన నిధి ఒక వ్యక్తికి దొరికితే, అతను ఆ నిధిని భూమిలో పాతి పెట్టడం లాంటిది. అతను నిధిని తవ్వి చూసి, తిరిగి ఎవరూ అది కనిపెట్టకుండా పాతిపెట్టాడు. తరువాత అతను ఆ పొలం కొనడానికి తన ఆస్తులన్నీ అమ్మి, ఆ పొలాన్ని కొని, ఆ నిధిని సంపాదించుకుంటాడు."

45 "పరలోకం నుండి దేవుడు ఏలడం ఎంత విలువైనదంటే, మంచి నాణ్యత ఉన్న ముత్యాలను కొనడానికి వ్యాపారి వెదకడం లాంటిది. 46 అతను బాగా ఖరీదైన ముత్యం అమ్మకంలో ఉండడం చూసి, ఆ ముత్యం కొనడానికి ఆస్తులన్నీ అమ్మి డబ్బు సంపాదించి, వెళ్ళి దాన్ని కొంటాడు."

47 "దేవుడు పరలోకం నుండి ఏలడం పెద్ద వలతో సరస్సులో చేపలు పట్టిన చేపలు పట్టే విధంగా ఉంటుంది. పనికి వచ్చేవి, పనికి రానివి అన్ని రకాల చేపల్ని వాళ్ళు పడతారు. 48 వల నిండినప్పుడు ఒడ్డుకు వలను లాగి, కూర్చొని, పనికిరానివి పడేసి, మంచి చేపల్ని బుట్టలో వేసుకోవడం లాంటిది."

49 "యుగాంతంలో మనుషులకి ఇలాగే జరుగుతుంది. మనుషులకి తీర్పు ఇచ్చేటప్పుడు అక్కడికి దేవ దూతలు వస్తారు. నీతిమంతుల నుండి చెడ్డవాళ్లను వేరు చేస్తారు. 50 నరకంలోని మంటల్లోకి చెడ్డ వాళ్ళను విసిరేస్తారు. వాళ్ళు ఆ నొప్పి, బాధ తట్టుకోడానికి ఏడుస్తూ, పళ్ళు కొరుకుతారు."

51 యేసు తన శిష్యుల్ని, "నేను చెప్పిన ఈ ఉపమానాలన్నీ అర్థం అయ్యాయా" అని అడిగాడు. వాళ్ళు, "మేము అర్థం చేసుకున్నాం" అన్నారు. 52 అప్పుడు ఆయన, "బోధకులూ వ్యాఖ్యానించే వాళ్ళూ ఈ ఉపమానాల్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం ఉంటూ పరలోకం నుండి దేవుని ఏలిక క్రింద ఉండడం గదిలోనుండి కొత్త బట్టలూ పాత బట్టలూ బయటికి తెచ్చి పంచిన ఇంటి ఓనర్ లాంటిది. 53 యేసు ఈ ఉపమానాలు చెప్పడం పూర్తయ్యాక తన శిష్యుల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు."

54 తరవాత యేసు సొంత ఊరు నజరేతుకు వాళ్ళు వెళ్ళారు. సమాజమందిరాల్లో సబ్బాతు రోజున బోధించడం మొదలు పెట్టాడు. అయన మాటలకు అక్కడి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ కొందరు ఇతడు మనలానే మామూలు మనిషి. ఇంత అవగాహనా, జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఇలాంటి అద్భుతాలు ఎలా చెయ్యగలుగుతున్నాడు? 55 ఇతడు వడ్రంగి కొడుకే గదా! ఇతని తల్లి మరియే గదా! ఇతని తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కదా! 56 ఇతని చెల్లెళ్ళు అందరూ మన ఊరిలోనే ఉంటారు కదా! మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు, ఎలా బోధించ గలుగుతున్నాడు? అనుకున్నారు.

57 యేసుకు అలాంటి అధికారం ఉండడాన్ని ఆ ఊరివాళ్ళు అంగీకరించలేక పోయారు. దానికి యేసు వాళ్ళతో, "నన్నూ ఇతర ప్రవక్తల్ని ఎక్కడికి వెళ్ళినా గౌరవించారు. కానీ మన ఊరిలో గౌరవించడం లేదు. మన సొంత కుటుంబాలు కూడా మనల్ని గౌరవించరు!" అన్నాడు. 58 యేసుకు అలాంటి అధికారముందని ఆ ఊరి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చెయ్యలేదు.