12

1 అది విశ్రాంతి దినం. ఆ సమయంలో యేసు, తన శిష్యులు పంట చేలల్లో నడిచి వెళ్తున్నారు. ఆయన శిష్యులకు ఆకలేసి కంకులు తుంచి తింటున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం దీనికి అభ్యంతరం లేదు. 2 శిష్యులు ఇలా చేయడం కొందరు పరిసయ్యులు చూసి యేసుతో, "చూడూ, నీ శిష్యులు విశ్రాంతి దినం అయినా పనిచేస్తున్నారు. ధర్మశాస్త్రం దీన్ని ఒప్పుకోదు" అన్నారు.

3 దానికి యేసు, "మన పితరుడు దావీదు రాజు, ఆయన మనుషులు ఆకలిగా ఉన్నప్పుడు ఏమి చేసారో లేఖనాల్లో ఉంది. 4 దేవుణ్ణి ఆరాధించే పవిత్ర గుడారంలో దావీదు దేవుడి ముందు పెట్టిన రొట్టెను తిన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కేవలం యాజకులకి మాత్రమే ఆ రొట్టె తినే అనుమతి ఉంది. కానీ దావీదు, అతని మనుషులు కలిసి ఆ రొట్టెలు తిన్నారు. 5 మోషే రాసింది మీరు కచ్చితంగా చదివే ఉంటారు. విశ్రాంతి రోజున యాజకులైనా సరే దేవాలయంలో పనిచేస్తే, వాళ్ళు విశ్రాంతిదినానికి సంబంధించిన ఆజ్ఞలకు లోబడకపోయినా, వాళ్ళు తప్పు చేసినట్టు కాదు."

6 "దీని అర్థం నేను చెప్తాను. నేను మీ దగ్గరికి వచ్చాను. నేను దేవాలయం కంటే గొప్ప వాణ్ణి. 7 లేఖనాల్లో ఉన్న ఈ దైవవాక్కుల గురించి మీరు ఆలోచించాలి. "మీరు బలులు అర్పించడం మాత్రమే కాదు, కనికరం చూపించాలని కోరుతున్నాను." దీని అర్థం మీకు తెలిసి ఉంటే ఏ తప్పూ చెయ్యని నా శిష్యుల్ని మీరు నిందించరు. 8 నేను మనుష కుమారుణ్ణి. విశ్రాంతి రోజున ఏమి చెయ్య వచ్చో ప్రజలకు చెప్పే అధికారం నాకు ఉంది" అన్నాడు.

9 ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. 10 అక్కడ ఊచ చెయ్యి ఉన్న వ్యక్తి కనిపించాడు. అక్కడ ఉన్న పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి వాదం పెట్టుకోవాలని ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఆయనతో, "విశ్రాంతి రోజున ఎవరినైనా స్వస్థపరచడానికి దేవుడు అనుమతిస్తాడా?" అని అడిగాడు. యేసు ఏదొక తప్పు మాట్లాడి పొరపాటు చేస్తాడని వాళ్ళు అనుకున్నారు. 11 ఆయన వాళ్లకు జవాబిస్తూ, "మీకు ఒక గొర్రె ఉందనుకోండి. అది విశ్రాంతి రోజున గుంటలో పడింది. దాన్ని అక్కడే వదిలేస్తారా? కచ్చితంగా వదలరు. దాన్ని జాగ్రత్తగా బయటికి తీస్తారు గదా."

12 "కానీ గొర్రె కంటే మనిషి విలువైన వాడు. కాబట్టి ఒక మనిషిని మంచి ఉద్దేశంతో స్వస్థపరచడం ఏ రోజైనా చెయ్యొచ్చు. అది విశ్రాంతి దినమైనా సరే" అని చెప్పాడు. 13 అప్పుడు ఆయన ఆ వ్యక్తితో, "నీ చెయ్యి చాపు" అన్నాడు. ఆ వ్యక్తి తన ఊచ చెయ్యి చాపాడు. అది రెండో చెయ్యిలా మామూలుగా అయ్యింది. 14 అప్పుడు పరిసయ్యులు సమాజ మందిరం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి యేసుని ఎలా చంపుదామా అని కుట్రలు మొదలు పెట్టారు.

15 పరిసయ్యులు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని గ్రహించి, ఆయన శిష్యుల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది రోగులతో సహా పెద్ద ఎత్తున జనం గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. ఆయన వాళ్ళని స్వస్థపరిచాడు. 16 కానీ తన గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్లకి గట్టిగా చెప్పాడు.

17 ఇలా చెయ్యడం వల్ల పూర్వం యెషయా ప్రవక్త రాసింది నెరవేరింది. అదేమిటంటే,
18 "నేను ప్రేమించిన వాడు, నన్ను సంతృప్తి పరచినవాడు,
నేను ఎన్నుకున్న నా సేవకుడు ఇక్కడ ఉన్నాడు.
నా ఆత్మను ఆయనలో ఉంచుతాను,
ఆయన యూదులు కానివారికి రక్షణ తెచ్చి, న్యాయం చేస్తాడు.
19 ఆయన మనుషులతో పోట్లాడడు, కేకలు వేయడు. ఆయన వీధుల్లో అరవడు.
20 ఆయన బలహీనులతో సున్నితంగా వ్యవహరిస్తాడు,
కొన ప్రాణంతో ఉన్న వాణ్ణి ఆయన చంపడు.
ప్రజలకి న్యాయంగా తీర్పు తీర్చి వారిని నిరపరాధులుగా ప్రకటిస్తాడు.
21 కాబట్టి యూదులు కానివారు ఆయనలో నమ్మకం ఉంచుతారు."

22 ఒక రోజు కొందరు మనుషులు దయ్యం పట్టి గుడ్డి, మూగ అయిన వాణ్ణి తీసుకు వచ్చారు. యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టి అతన్ని బాగు చేసాడు. అప్పుడు అతను చూడగలిగాడు, మాట్లాడగలిగాడు. 23 అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళల్లో ఒకరితో ఒకరు, "ఈయన దావీదు వంశంలో మనం కనిపెడుతున్న క్రీస్తు అయి ఉండొచ్చు" అనుకున్నారు. 24 కానీ పరిసయ్యులు ఈ అద్భుతం గురించి విని, "ఆయన దేవుడు కాదు. బయల్జెబూలు. దయ్యాలరాజు. అందుకే దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు" అన్నారు.

25 యేసుకు పరిసయ్యులు అనుకునేవన్నీ తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళతో, "ఒకే రాజ్యంలోని ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే తమ రాజ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు గదా! ఒకే ఊరి వాళ్లుగాని, ఒకే ఇంట్లోని వాళ్ళు గానీ పోట్లాడుకుంటుంటే వాళ్ళు కచ్చితంగా ఒకటిగా, కుటుంబంగా నిలవలేరు. 26 అదే విధంగా సాతాను తన సొంత దయ్యాల్ని బయటికి పంపేస్తే తనకుతానే విరోధం అవుతున్నట్టు గదా. అలాంటప్పుడు తన సేవకుల మీద అతడెలా ఏలుబడి చేయగలుగుతాడు? 27 ఇంకా చెప్పాలంటే, సాతాను వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ శిష్యులు కూడా అదే సాతాను వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నారా? వాళ్ళ పని వెనుక సాతాను శక్తి ఉంది అనే మీ మాటకు వాళ్ళే మీకు బుద్ధి చెబుతారు. 28 దేవుని ఆత్మ వలన మాత్రమే నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని ఇప్పటికే పరలోకం నుండి దేవుడు చేస్తున్న పాలన నిర్ధారిస్తుంది."

29 "నేను దయ్యాల్ని ఎలా వెళ్ళగొట్టగలుగుతున్నానో మీకు చెప్తాను. సాతాను లాంటి బలవంతుడి ఇంట్లోకి ఎవరూ చొరబడ లేడు. ఆ బలవంతుణ్ణి కట్టేయకుండా వాడి ఆస్తుల్ని దోచుకోలేడు. వాణ్ణి కట్టేస్తేనే అది సాధ్యం."

30 "అటోఇటో ఉండాలి తప్ప తటస్థంగా ఎవరూ ఉండలేరు. నన్ను వ్యతిరేకిస్తున్న దయ్యాల్ని పవిత్రాత్మ వలన మాత్రమే వెళ్ళగొడుతున్నానని గుర్తించనివాడూ నా శిష్యులు కావడానికి మనుషులను పోగుచెయ్యనివాడూ నా నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోయేలా చేస్తున్నట్టే. 31 దయ్యాల్నివెళ్ళగొట్టింది పరిశుద్ధాత్మ వలన కాదు అని మీరు అంటున్నారు. కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా ఇతరుల్ని అవమానించి, కోపం తెప్పించి, అలా చేసినందుకు విచారించి దేవుని క్షమించమని అడిగితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను అవమానించిన వాణ్ణి మాత్రం దేవుడు క్షమించడు. 32 మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను విమర్శించే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. కానీ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేసే పనుల్ని చెడ్డగా చేసి చెప్పే వాళ్ళని దేవుడు క్షమించడు. ఇప్పుడే కాదు రాబోయే లోకంలో కూడా దేవుడు క్షమించడు."

33 "ఒక చెట్టు పండు చూసినప్పుడు ఆ పండు మంచిదో కాదో చెప్ప వచ్చు. పండు మంచిదైతే దాని చెట్టూ మంచిదని తెలుస్తుంది. నేను మంచి పనులు చేస్తుంటే నేను మంచి వాణ్ణి ఔనో కాదో మీకు తెలుస్తుంది."

34 "మీరు పాము పిల్లల్లాంటి వాళ్ళు. మీరు చెడ్డవాళ్ళు కాబట్టి మంచిది ఏదీ మాట్లాడలేరు. ఒకడు చెప్పేది అతని మనస్సులో నుండి వస్తుంది. 35 మంచి వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు. ఎలాగంటే మంచిమాటలు ఒక చోట పదిలంగా దాచి ఉంచి, ఏ సమయంలోనైనా వాటిని బయటికి తీయగలరు. అయితే దుష్టులు చెడు మాటలు పలుకుతారు. ఎందుకంటే వాళ్ళు అలాటి మాటలను దాచి ఉంచి ఎదో ఒక సమయంలో వాటిని బయటికి తెస్తారు."

36 "నేను మీకు చెప్తున్నాను. దేవుడు న్యాయం తీర్చే రోజున మనుషులు మాట్లాడిన ప్రతి పనికి రాని మాటనీ లెక్కలోకి తీసుకుంటాడు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన తీర్పునిస్తాడు. 37 మీరు మాట్లాడిన మాటల ఆధారంగా మీ మాటలు నీతిగా ఉన్నాయో లేవో మీరు దోషులో కాదో దాన్ని బట్టి దేవుడు అప్పుడు ప్రకటిస్తాడు" అన్నాడు.

38 అప్పుడు కొందరు పరిసయ్యులు, యూదు పండితులు యేసు మాటలకి స్పందిస్తూ "బోధకా, నిన్ను దేవుడు పంపాడని సూచనగా మేము చూస్తుండగా ఒక అద్భుతం చెయ్యి" అన్నారు. 39 దానికి యేసు, "నేను అద్భుతాలు చెయ్యగా మీరందరూ చూసిన వాళ్ళే. చెడు ఉద్దేశంతో మీరు దేవుని నమ్మకంగా పూజించలేరు. దేవుడు నన్ను పంపాడని నిరూపించడానికి మీరు నన్ను అద్భుతం చెయ్యమంటున్నారు కానీ దేవుడు ఒకే అద్భుతాన్ని మీకు చూపిస్తాడు. అది యోనా ప్రవక్తకు జరిగిన అద్భుతం వంటిది."

40 "యోనాను దేవుడు బయటికి రప్పించే వరకు మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఉన్నాడు. అలాగే మూడు పగళ్ళు మూడు రాత్రులూ మనుష్య కుమారుడినైన నేను భూగర్భంలో ఉంటాను. తరువాత దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు. 41 దేవుడు అందరికీ తీర్పు ఇచ్చేటప్పుడు నీనెవె పట్టణంలో నివసించిన ప్రజలు ఆయన ఎదురుగా మీ పక్కన నిలబడతారు. యోనా హెచ్చరించినప్పుడు వాళ్ళు పాపం చెయ్యడం మానేశారు. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. నేను యోనా కంటే గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు కాబట్టి దేవుడు మీకు తీర్పు ఇస్తాడు."

42 "ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్న షేబా దేశంలో, చాలా కాలం క్రితం జీవించిన ఆ దేశం రాణి సొలోమోను జ్ఞానవాక్కులు వినడానికి చాలా దూరం నుండి వచ్చింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సొలోమోను కంటే చాలా గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు. కాబట్టి దేవుడు ప్రతి వాళ్లకి తీర్పు తీర్చేటప్పుడు షేబా దేశం రాణి ఆయన ఎదురుగా మీపక్కన నిలబడి మీపై నింద వేస్తుంది."

43 "కొన్ని సార్లు దురాత్మ ఒక వ్యక్తిని వదిలి పోయి, నిర్జన ప్రదేశాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడానికి ఎవరు దొరుకుతారా అని వెదుకుతుంది. దానికి ఎవరూ దొరకక 44 ఇంతకుముందు నేను ఉన్న వాడి దగ్గరికే వెళ్తాను అనుకుని, అక్కడికి తిరిగి వెళ్ళి అతని జీవితం కడిగిన ఇంటిలాగా అంతా శుభ్రంగా, పద్ధతిగా అమర్చి ఖాళీగా ఉండడం చూసింది. అతని వ్యక్తిగత జీవితం దేవుని ఆత్మ స్వాధీనంలో లేకపోవడం గమనించింది. 45 అప్పుడు ఆ దురాత్మ వెళ్ళి, ఇంకా చెడ్డవి ఏడు ఆత్మల్ని తీసుకు వచ్చి అతనిలో ప్రవేశించి, అక్కడే ఉంటాయి. కాబట్టి అతని పరిస్థితి ముందు కంటే ఇంకా ఘోరంగా అయ్యింది. చెడ్డ వాళ్లైన మీరు కూడా నేను బోధించింది అనుభవంలో చూస్తారు" అన్నాడు.

46 యేసు ఇంకా జనాలతో మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ తమ్ముళ్ళూ వచ్చారు. ఆయనతో మాట్లాడాలని బయట నిల్చున్నారు. 47 ఆయనతో ఒకరు,"మీ అమ్మా, తమ్ముళ్ళూ నీతో మాట్లాడాలని బయట నిల్చుని ఉన్నారు" అని చెప్పారు. 48 అప్పుడు యేసు అతనితో, "నా నిజమైన తల్లీ తమ్ముళ్ళూ ఎవరో మీకు చెప్తాను" అని, 49 తన శిష్యులను చూపిస్తూ, "నా తల్లీ తమ్ముళ్ళు వీళ్ళే. 50 పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టమైనట్టు ఎవరు ఉంటారో వాళ్ళే నా తమ్ముళ్ళూ నా తల్లీ" అన్నాడు.